Friday, July 6, 2012

మన మహనీయులు 2

మండన మిశ్రుడు!



ఆది శంకరాచార్యుల జీవిత చరిత్రలను తెలిపే గ్రంధాన్ని శంకర విజయం అని వ్యవహరిస్తారు. శంకర విజయాలుగా అనేక గ్రంధాలు వున్నాయి. ఒకదానితో ఒకటి కొద్దిగా సమాచారంలో మార్పులు చేర్పులు కలిగి వుంటాయి. ఆది శంకరాచార్యుల జీవితం లోనూ జీవిత చరిత్ర లోనూ ప్రముఖమైన ఘట్టం మండన మిశ్రులకూ ఆది శంకరాచార్యులకూ జరిగిన వాదం. మండన మిశ్రుల వారి పేరు కూడా అక్కడక్కడా కొద్దిగా తేడాలతో వున్నది, అలాగే వారి భార్య పేరు, వారి నివాస స్థలము..కూడా. కుమారిలభట్టు వారు తమ దేహ త్యాగం సందర్భంలో ఆది శంకరాచార్యులవారికి తన శిష్యుడు ఐన విశ్వరూపుడి గురించి చెప్పి అతడు ఆదిశంకరుల దశోపనిషత్తుల పై భాష్యానికి వార్తికం వ్రాయగల సమర్ధుడని చెప్పి, ఆయనను కలుసుకొమ్మని చెప్తే, ఆది శంకరాచార్యుల వారు మాహిష్మతీ పురం వెళ్లి ఆ విశ్వ రూపుడిని కలుసుకుంటారు.

ఆ విశ్వరూపుడే మండన మిశ్రుడు. ఆయనయే తరవాతి కాలంలో శంకరాచార్యులవారి అగ్ర శిష్యులలో ఒకరైన సురేశ్వరుడు. ఆది శంకరాచార్యుల తర్వాత ఈయన శంకర పీఠముల నిర్వహణను పర్యవేక్షించారు. ఆది శంకరాచార్యుల నలుగురు ప్రధాన శిష్యులలో ఈయన జ్ఞాన రీత్యా వయసు రీత్యా కూడా వరిష్టులు, గరిష్టులు! మాహిష్మతీ పురం చేరుకున్న శంకరాచార్యుల వారు నర్మదా నదిలో స్నానం చేసి వడ్డుకు వచ్చి మండన మిశ్రుల ఇంటికి దారి నడిగితే, నదికి నీరు తీసుకొని పోవడానికి వచ్చిన స్త్రీలు '' ఆ యింటి చావడిలో పెంపుడు చిలుకలు కూడా వేద చర్చ చేస్తుంటాయి..ఆ ఇల్లే ఆయన ఇల్లు..'' అని ధనికులు నివసించే ఒక వీధి గురించి చెప్పి ఆ వీధిలో ఆయన యింటి చిరునామా చెప్పారట. ఆ ఇంటికి వెళ్ళిన ఆదిశంకరులు ఆ రోజు మండన మిశ్రులు తమ తండ్రి గారి ఆబ్దికం కనుక..శ్రాద్ధ కర్మలలో..పిత్రు కార్యంలో వుండి..యింటి సింహద్వారం తలుపులు వేసి వుంటే..యోగ మార్గంలో..లోపలి వెళ్లి..మండన మిశ్రుల వారి ఎదుట ప్రత్యక్షం అయ్యారు. సన్యాసులు కర్మ కాండలలో ప్రమేయం, నమ్మకం లేనివారు కనుక, అక్కడ శంకరుడు ప్రత్యక్షం కావడాన్ని మండన మిశ్రుడు హర్షించ లేదుట. భిక్ష తీసుకొని వెళ్లి రండి అని అంటే..నేను వాద భిక్ష కోసం వచ్చాను..ఆ భిక్షనే స్వీకరిస్తాను..నాతో శాస్త్ర చర్చ చేయమని ఆది శంకరుడు అడిగితే..ఈ పిత్రు కార్యం అయిపోయిన తర్వాత వాదం చేద్దాం..మీరు బయట విశ్రమించండి..అని చెప్పి..అదే ప్రకారం ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత మండన మిశ్రుడు అదిశంకరచార్యులతో వాదానికి దిగాడు..ప్రధానం గా వేద విజ్ఞాన సంబంధ చర్చ జరిగింది. వేదాలలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. కర్మకాండ, జ్ఞాన కాండ అనేవి. యజ్ఞ యాగాదులూ, పూజలూ, హోమాలూ, జప తపాదులు..ఇవన్నీ జ్ఞాన కాండ లో భాగాలూ అయితే..వేదాంతం అని పిలువబడే జ్ఞాన కాండ ఐన ఉపనిషత్తులు రెండవ భాగం! మహా జ్ఞానులు ఐన ఈ ఇద్దరి వాదానికి న్యాయ నిర్ణేతగా ఎవరు వుండాలి అని ప్రశ్న ఉదయించింది. మండన మిశ్రుని భార్య, మహా విద్వాంసురాలు, విదుషీ మణి ఐన సరస వాణి (ఈమెకే ఉభయ భారతి అని కూడా పేరు) న్యాయ నిర్ణేతగా ఉండాలని అంగీకారం కుదిరింది. మండన మిశ్రుడు సాక్షాత్తూ బ్రహ్మదేవుని అంశా సంభూతులనీ, సరస వాణి సరస్వతీ అవతారం అనీ నమ్మకం. ఆది శంకరులు ఎలాగూ అపర కైలాస శంకరుడే!

అనేక దినములు ఇరువురికీ శాస్త్ర చర్చ జరిగింది. ముందుగా నిర్ణయించుకున్న షరతు ప్రకారం ఆ చర్చలో వోడిపోయిన వారు, వారు వున్న ఆశ్రమమును వదలి పెట్టి, గెలిచిన వారి శిష్యులై, గెలిచిన వారి ఆశ్రమమును స్వీకరించి అనుసరించాలి. మండన మిశ్రుడు గృహస్థాశ్రమంలో వున్న వాడు. ఆది శంకరుడు ఎలాగూ సన్యాసాశ్రమంలో వున్న వారు! పర పురుషుడి ఎదురుగా స్త్రీ వుండకూడదు అని ఒక తెరను వేసి..తెర మాటున సరస వాణి కూర్చుని న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుండగా..ఇరువురు కారణజన్ముల మధ్య శాస్త్ర చర్చ జరిగింది. చివరికి..మండన మిశ్రుడి సిద్ధాంతాలనే తనకు అనుకూలంగా తర్కించి..తన వాదం సరి ఐనదని, వేదముల సర్వోత్కృష్ట లక్ష్యం జ్ఞాన కాండయే అని నిరూపించి, ఆది శంకరులు వాదంలో గెలిచారు. నిబంధన ప్రకారం మండన మిశ్రుడు సన్యాసం స్వీకరించి శంకరుల శిష్యుడైనాడు. అర్ధాంగి ఐన తనను కూడా జయిస్తేనే ఆది శంకరుల జయం సంపూర్ణం అవుతుందని, వాదించి, వొప్పించి, సరస వాణి తను అప్పుడు ఆది శంకరులతో శాస్త్ర చర్చకు దిగిందని కొన్ని శంకర విజయాలు పేర్కొంటాయి. ఆ వాదంలో కొంత నిజమున్నది కనుక, భార్య భర్త శరీరంలో సగ భాగం కనుక, ఆవిడ సాక్షాత్తూ సరస్వతీ అంశ అని గ్రహించిన వారు కనుక, శాస్త్ర చర్చకు ఆహ్వానిస్తే తిరస్కరించకూడదు కనుక, ఆది శంకరుడు అంగీకరించారు అని భావించడం సమంజసమైనది అనే మనం భావించాలి! సరసవాణి కూడా చర్చలో వెనుకబడి పోవడం ప్రారంభం కావడం తో ఆవిడ కామ శాస్త్ర చర్చకు దిగేసరికి..కామ శాస్త్ర సంబంధ ప్రశ్నలను సంధించడం ప్రారంభించే సరికి శంకరులు అప్రతిభులయారు. సమస్త శాస్త్రములూ ఎవరినుండి ఉద్భవించాయో ఆ దక్షిణామూర్తి ఐన పరమశివుని అవతారమే ఆది శంకరుడు ఐనప్పటికీ..ఈ శరీరంలో ఆది శంకరాచార్యుడిగా ఆయన బ్రహ్మచర్యాశ్రమం ముగిసిన తర్వాత నేరుగా సన్యాసాశ్రమంలో ప్రవేశించిన వారు కనుక, కామ శాస్త్ర విజ్ఞానం బ్రహ్మచారి కి కానీ, సన్యాసికి కానీ అవగతం అయ్యే అవకాశం లేనందున, ( ఈ నాటి బ్రహ్మచారులు, సన్యాసులకు ఈ దురదృష్టకర నిబంధన లేదేమో కానీ..) తమకు అవగతం కాని దానిని గురించి, అనుభవంలోకి రాని దానిని గురించి వాదించడం సంప్రదాయం కాదు కనుక, ఏమీ చేయాలో పాలు పోని ఆది శంకరాచార్యుల వారు ఒక మాసం గడువు అడిగి, మాసం తర్వాత మరలా సరసవాణి తో వాదానికి వస్తానని చెప్పి అక్కడి నుండి బయలు దేరారు!

ఏమీ చేయాలా అని ఆలోచిస్తూనే తమ యాత్ర కొనసాగిస్తూ శిష్య బృందంతో సహా..మధ్య భారతం లో ఒక రాజ్యం గుండా వెళ్తున్నప్పుడు..ఆ దేశపు మహారాజు..అమరుకుడు అనే వాడు..రాజ్య భోగాలలో జీవితాన్ని వ్యర్ధం చేసుకుని అకాల మరణం పొంది.. అతని మృత కళేబరం అంత్య క్రియలకు సిద్ధం చేయబడితే..ఆ మార్గం గుండా వెళ్తున్న ఆదిశంకరాచార్యుల వారు ఒక ఆలోచన స్ఫురించి..పరకాయ ప్రవేశ విద్య ద్వారా ఆ రాజు శరీరం లోకి ప్రవేశించ బోతూ..తాము తిరిగి వచ్చే వరకూ తమ భౌతిక దేహాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండమని శిష్యులకు చెప్పి తాము ఆ రాజు శరీరంలోకి ప్రవేశించే సరికి..చనిపోయిన రాజు లేచి కూర్చున్నాడు. అందరూ సంతోషించారు. అంతః పురానికి చేరుకున్న తర్వాత..ఆ కామ భోగాలలో పడి..సమయం గడిచి పోతుంటే..మహారాణి ఇంతకు ముందు లేని అలౌకిక ఆనందాన్ని ఆయనతో గమనించి..వృద్ధుడు, మహా మేధావి ఐన మంత్రి ఆయనలో తేజస్సు, ప్రజ్ఞ, గమనించి.. అనుమానించారు! చూచాయగా విషయాన్ని గ్రహించిన వృద్ధ మంత్రి రాజ్యంలో ఏ జ్ఞాని, సన్యాసి..మహానుభావుడి మృత కళేబరం ఐనా దహన సంస్కారాలు లేకుండా వుంటే వెంటనే గమనించి దహనం చేయ వలసిందిగా ఆజ్ఞాపించాడు. ఇక్కడ అరణ్యంలో ఒక చెట్టు తొర్రలో ఆది శంకరుల భౌతిక శరీరాన్ని వుంచి కాపలా గాస్తున్న శిష్యులకు నానాటికీ ఆందోళన పెరిగిపోయి..చివరికి రాజ భటులు ఆ దేహాన్ని గమనించే స్థితి వచ్చే సరికి ఇంకా కంగారు పడిపోయి..ప్రధాన శిష్యులు రాజు గారి కోట చుట్టూ డప్పులు మ్రోగిస్తూ.. ''తత్త్వమసి.. తత్త్వమసి..తత్త్వమసి..''..(నీవు నీవు కావు..నీవు ఫలానా..అనే సూచనతో..) అనే ఉపనిషత్ వాక్యాలతో..వేద మంత్ర పఠనం తో తిరుగుతుంటే..ఆ వాక్యాలను..మంత్రాలను విన్న రాజు గారి దేహంలోని ఆది శంకరాచార్యులవారు..తమ యదార్ధ స్థితికి వచ్చి..పరుగున తమ శరీరాన్ని దాచి వుంచిన స్థలానికి వచ్చేప్పటికే..ఆ సరికి బలవంతంగా ఆ శరీరాన్ని స్వాధీనం చేసుకున్న రాజభటులు ఆ శరీరానికి చితి పేర్చి నిప్పు అంటించారు..మంటలు క్రమ క్రమంగా దేహాన్ని అలుముకుంటుంటే..ఆ శరీరంలోకి ప్రవేశించిన ఆది శంకరులు.. అంత వరకూ..అజ్ఞాని వలె..అంటే బాలునివలె..మాయలో పరిభ్రమించినందుకు..బాలురను పరి రక్షించడంలో నృసింహుని మించిన దైవం లేనందుకు..దివ్యమైన నృసింహ కరావలంబ స్తోత్రం చేశారు..ఆ స్తోత్రంలో ఈ ప్రస్తుత స్థితికి సంబంధించిన శ్లోకాలు కూడా వున్నాయి..మనం గమనింప వచ్చు..స్తోత్రం పూర్తి అయ్యేసరికి మంటలు ఆరిపోయి..వాడని పుష్పం వలె ఆది శంకరుడు బయటకు వచ్చి..శిష్య గణం తో మరలా సరస వాణి సన్నిధి కి వచ్చీ రావడంతోనే..ఈయన మొహంలోని తేజస్సును బట్టే ఈయన ఆ శాస్త్ర విజ్ఞానాన్ని కరతలామలకం చేసుకున్నాడని ఆమె గ్రహించిందట. ఇద్దరికీ వాదం జరిగింది. ఆది శంకరుడు జయించాడు. ఆవిడ తన అవతారం చాలించి వెడుతుంటే ఆది శంకరుడు ఆవిడను అభ్యర్ధించి..తాము స్థాపింప బోయే పీఠం లో అధిష్టాన దేవతగా ఉండమని అభ్యర్ధించారు. ఆవిడ అంగీకారం మేరకు శృంగేరి శారదాపీఠం లో ఆవిడ మూర్తి ని స్థాపించారు. మండన మిశ్రుడు ఆయనకు శిష్యుడై, సురేశ్వరుడు అనే సన్యాస నామం స్వీకరించి..ఆయన భాష్యాలకు వార్తికాలు రచించి..ఆయన తర్వాత శంకర మఠముల నిర్వహణ చేశారు! ఆది శంకరుల తైత్తిరీయ ఉపనిషత్ భాష్యానికీ, బృహదారణ్యక ఉపనిషత్ భాష్యానికీ వార్తికాలు వ్రాశారు. నైష్కర్మ సిద్ది అనే ఉద్గ్రంధాన్ని వ్రాశారు. ఆది శంకరులు తమకు అప్పజెప్పిన విధి నిర్వహణ లో అమర గతిని చెందారు! జయ జయ జయ శంకర!

Saturday, May 5, 2012

పిట్టకథలు

మన పురాణ ఇతిహాసాలపై, కట్టుకథలు పిట్టకథలు చాలా ఉన్నాయి.

ఉదా : సినిమాల్లో " ఇంద్రుడు " అనగానే క్లబ్బు డాన్సులు, ఆయన్ని గందరగోళంగా చూపిస్తారు.
ఇంద్రుడు దేవతలకు రాజు కాబట్టి ఎవరైనా " తపస్సు " ఆచరిస్తే " కామానికి, క్రోధానికి " లొంగిపోతాడా ?
లేక భగవంతుని చేరుకుంటాడా ? అని పరీక్ష చేసే అధికారం ఆయనకి ఉంది. అందుకే రంభాది పరీక్షలు.

కల్పాన కథలు :
కవులు కూడా చాల కథలు సృష్టించారు. 

౧]  శ్రీ కృష్ణార్జున యుద్ధం

వారిద్దరు నర నారాయణులు అన్యోన్న్య ప్రీతి కలవారు.
పురాణాల్లో వీరికి యుద్ధం జరిగినట్టుగా ఎక్కడా లేదు 
ఉదా : ఖాండవ వన దహన సమయంలో మయుడు అనే రాక్షసుని సంహరించడానికి,
శ్రీకృష్ణుడు చక్రాన్ని ప్రయోగిస్తాడు. అది చూసి మయుడు " అర్జునా రక్ష రక్ష " అంటాడు.
అర్జునుడు అభయం ఇవ్వగానే కృష్ణుడు తన సుదర్శనాన్ని ఉపసంహరించుకుంటాడు.
అసలు శ్రీ కృష్ణుడు " అర్ఘ్యం " వదలనూలేదు గంధర్వుని " నిష్టీవనం " పడనూ లేదు. 
అర్జునుడు అభయం ఇస్తే కృష్ణుడు సంహరిస్తానని అనడు యుద్ధానికి రాడు. కేవలం,
కవుల కల్పితాలే ఇవన్నీ..

౨ ] శ్రీ కృష్ణ తులాభారం 

మన సంస్కృతిలో పతినే  ప్రత్యక్ష దైవంగా పూజిస్తాము 
అలాంటిది పతిని దానం చేసే వ్రతం ఉంటుందా ?
మూలంలో లేని కథలన్నీ కల్పించి రాస్తే దాన్ని సినిమా వాళ్ళు,
మరి కొంచం మెరుగులు దిద్ది ప్రజల్లోకి వదిలారు.
సినిమా వాళ్ళు కూడా మన పురాణేతిహాస కథలను భ్రష్టు పట్టించారు.

౩] మాయా బజార్ 

అసలు బలరాముడికి " శశిరేఖ " అన్న కూతురే లేదు దానికి పెళ్లి తతంగం స్టంటు
అందుకే " మాయాబజార్ " అన్న పేరు పెట్టారేమో ?

౪] రామాంజనేయ యుద్ధం 

ఇలాంటివి ఎన్నో సినిమాలు ఉండటం వల్ల ప్రజలు అవి వాస్తవం అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు..
పాపం వాళ్లకి మాత్రం ఏమి తెలుసు..!
అందుకే " పురాణ గ్రంధాలు " చదవనిదే ఇది వాస్తవం అని నిర్ధారించు కోవద్దు..

|| విశిష్ట ధ్యాన శ్లోకములు ||

గణాధిపతిని వర్ణించు పద్యము

అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా ల్యాంకవిచేష్ట తొండమున అవ్వలిచన్‌ కబళింపబోయి ఆ వంక కుచంబు గాన కహివల్లభహారము గాంచి వే మృణా ళాంకురశంక నంటెడు గజాస్యుని కొల్తు నభీష్టసిద్ధికిన్.


సరస్వతీ దేవి శ్లోకములు




శ్లో||  పంచాశల్లిపిభిర్విభక్త ముఖదో: పన్మధ్య వక్షస్థలాం
      భాస్వన్మౌలి నిబద్ధ చంద్ర శకలామాపీన తుంగస్తనీం
      ముద్రామక్షగుణం సుధాఢ్యకలశం విద్యాం చ హస్తామ్బుజై:
      బిభ్రాణాం విశదప్రభాం త్రినయనాం వాగ్దేవతామాశ్రయే ||



      శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
      హార తుషార ఫేన  రజతాచల కాశ ఫణీశ కుంద మం
      దార సుధాపయోధి సిత తామర  సామరవాహినీ శుభా 
      కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడుగల్గు భారతీ!  


త్రిమూర్తులను వర్ణించు శ్లోకము

రచన: నన్నయ్య 
 
శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ  శ్రీకంధరా శ్శ్రేయసే ||
 
 

నవగ్రహ ధ్యాన శ్లోకములు


శ్లో|| ఆరోగ్యం పద్మబన్ధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి:
     భూలాభం భూమిపుత్రస్సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య: |
     సౌభాగ్యం దేవమన్త్రీ రిపుభయశమనం భార్గవశ్శౌర్యమార్కి:
     దీర్ఘాయుస్సైంహికేయో విపులతరయశ: కేతురాచంద్రతారం ||

శ్లో|| అరిష్టాని ప్రణశ్యన్తు దురితాని భయాని చ |
      శాన్తిరస్తు శుభం మేస్తు గ్రహా: కుర్వన్తు మంగళం ||
స్త్రీరూపాం చింతయే ద్దేవీం పుంరూపం వా విచిన్తయేత్ |
అథవా  నిష్కలం ధ్యాయే   త్సచ్చిదానంద   లక్షణమ్ ||
                                                          తంత్రసార: 

स्त्री  रूपाम्  चिन्तये  द्देवीं  पुंरूपं वा   विचिन्तयेत
अथवा   निष्कलं   ध्याये  त्सच्छिदानन्द   लक्षणं ॥
                                                      तन्त्रसार :

జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య చిత్ర పటములు




Saturday, April 28, 2012

మన మహనీయులు

మన దేశ సంస్కృతిని దశ దిశల వ్యాపింప చేసిన వారు ఎందరో మహానుభావులు  ...అందరికి వందనములు 
అటువంటి మహనీయుల గురించి వివరించడం సాహసం అయినప్పటికీ ఈ ప్రయత్నాన్ని మన్నిస్తారని ఆశిస్తూ.....


మన మహనీయులు -1

వాల్మీకి మహర్షి :

శ్రీ రామాయణం అనే అమృత భాండాన్ని మనకు అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి...
వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు.
వాల్మీకి మహర్షి వృత్తాంతం స్కాంద పురాణంలో చెప్పబడుతుంది. వేదవ్యాసుడు సనత్సుజాతుడిని వాల్మీకి ముని వృత్తాంతం గురించి అడుగుతాడు. వాల్మీకి ముని పూర్వపు నామధేయం రత్నాకరుడు . రత్నాకరుని తల్లిదండ్రులు కౌశికి, సుమతి. చిన్నతనంలో రత్నాకరుడు  వేదాభ్యాసం సరిగా చేయలేదు. తల్లిదండ్రులు పెద్దవారు అయ్యాక ఆ రాజ్యంలో క్షామము వచ్చింది. అందువలనరత్నాకరుడు తిండి కోసం , దైనందిక జీవితం కోసం దారి దొంగగా మారిపోతాడు. ఒకరోజు దారి దోపిడి చేస్తుండగా సప్తఋషులు ఆ మార్గంలో వస్తారు. అప్పుడు అ సప్త మహర్షులలో ఒకరైన అత్రి మహర్షి రత్నాకరుని ప్రశ్నిస్తాడు. తన కుటుంబీకులు తాను చేస్తున్న పాపాన్ని భరిస్తారో లేదో కనుగొని రమ్మంటాడు. అప్పుడు రత్నాకరుడు  ఇంటికి చేరుకొని తన కుటుంబ సభ్యులను తాను చేసే కర్మలలో భాగం పంచుకొంటారా అని అడుగగా వారు పంచుకోమని చెబుతారు. విషయాన్ని వెళ్లి సప్తఋషుల కు చెప్పగా అపుడు అత్రి మహర్షి మోక్ష ప్రాప్తికి ధ్యానం చెయ్యమని రామ నామాన్ని తిప్పి "మరా" అని బోధించి మరా నామాన్ని జపించమని చెప్పి వెళ్లిపోతారు. చాలా కాలం తరువాత అత్రి మహర్షి ఆ మార్గంలో పయనిస్తుండగా అక్కడ ఒక చీమల పుట్ట కనిపిస్తుంది. అది చూసి అక్కడ రత్నాకరుడు  ఉన్నాడని గ్రహించి వానికి ఉపదేశం చేస్తాడు , 'వల్మీకం' అంటే పుట్ట నుండి వచ్చిన వాడు కాబటి వాల్మీకి అయ్యాడు.



ఒక నాడు నారద మహర్షి తో  వాల్మీకి లోకంలో  అన్ని గుణాలు కలిగిన వాడు ఎవరైనా వున్నారా అని అని అడుగగా అప్పుడు నారద మహర్షి ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు. 


సంక్షిప్త రామాయణం
http://www.freewebs.com/bhakthitelugu/samkshipta_ramayanam.pdf

చెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్న  సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది...........
************************************
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||
************************************
ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలొ ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు.

ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు "ఓ మహర్షి ! నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ." అన్నారు. ఆ శ్లోకానికి అర్ధం చూడండి......

"నిషాద" అంటె బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. "మా" అంటె లక్ష్మి దేవి. "మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః", అంటె లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. " యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్", కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జెరుగుగాక, అని ఆ శ్లోక అర్ధం మారింది.

బ్రహ్మగారు అన్నారు, "నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను " నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు.

అలా మనకు వచ్చినదే  శ్రీ రామాయణం.......

స్వస్తి .........
  

Friday, April 20, 2012

Wednesday, April 18, 2012

నడిచే దేవుడు

నడిచే దేవుడుగా పేరొందిన  sశ్రీ కంచి కామకోటి 68వ పీhSధిపతి శ్రీ చంద్ర శేఖర సరస్వతి స్వామి దివ్య చరణములకు ప్రణామములతో..........

జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య